చనిపోయే వరకు నటిస్తూనే ఉంటా..! | Sakshi
Sakshi News home page

చనిపోయే వరకు నటిస్తూనే ఉంటా..!

Published Tue, Dec 19 2017 8:23 AM

heroine y vijaya chit chat  trust womens in chennai - Sakshi

సాక్షి, చెన్నై: ‘పద్నాలుగేళ్లపుడు సినీరంగంలోకి వచ్చా... చనిపోయే వరకు నటిస్తూనే ఉంటా’నని సీనియర్‌ సినీనటి వై విజయ చెప్పారు. నేడు నాలుగో తరంతో నటిస్తున్నా, నాటితో పోల్చుకుంటే నేటి నటీనటుల్లో క్రమశిక్షణ, అంకితభావం కరువైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నపురి ట్రస్ట్‌ మహిళా విభాగ్‌ నెలనెలా నిర్వహించే సెలబ్రెటీలతో ముచ్చట్లు కార్యక్రమంలో సోమవారం నటి వై.విజయ, దివంగత నటి రాజసులోచన కుమార్తె, కళాకారిణి దేవీ కృష్ణ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. 

కార్యక్రమానికి హాజరైన మహిళలకు నటి వై విజయ తన జీవనగమనాన్ని వివరించారు. ఆమె మాటల్లోనే.. ఆరేళ్ల చిన్నారిగా ఒక సమావేశంలో పక్కన ప్రముఖ నటి రాజసులోచన కూర్చుని నన్ను దగ్గర తీసుకున్నారు. నన్ను నాట్యకళాకారిణిగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో తల్లిదండ్రులు చెన్నైకి మకాం మార్చారు. క్లాసికల్‌ కర్నాటక డ్యాన్స్‌ నేర్చుకున్నాను. 14 ఏళ్ల వయస్సులో 1953లో ఒక డాన్స్‌మాస్టారు నా ఫొటో అల్బం చూడడంతో సినీరంగ ప్రవేశం జరిగిపోయింది. తొలి చిత్రమే శోభన్‌బాబు పక్కన హీరోయిన్‌. ఆ తరువాత ఎంజీఆర్, శివాజీ, ఎన్‌టీఆర్‌ వంటి మహామహులతో పనిచేశాను. 

ఠంచనుగా టైమ్‌కు రావాలి, సెట్‌లోకి వచ్చే ముందే స్క్రిప్ట్, సీన్‌ తెలుసుకోవాలి తదితర క్రమశిక్షణ సీనియర్ల నుంచే నేర్చుకున్నాను. తెలుగులో మంగమ్మగారి మనుమడు చిత్రం మంచి బ్రేక్‌ ఇచ్చింది.  ప్రస్తుతం నేను నాలుగో తరంతో నటిస్తున్నానంటే ఆనందగా ఉందని వై విజయ అన్నారు.  దివంగత నటి రాజసులోచన కుమా ర్తె, ప్రముఖ నాట్యకళాకారిణి దేవీ కృష్ణ తన మాటల్లో అమ్మ అనుభవాలను పంచుకున్నారు. 1953లో విడుదలైన ‘కన్నతల్లి’ మా అమ్మకు తొలి చిత్రం. గొప్ప నటి, నర్తకి అయిన అమ్మ రాజసులోచన దక్షిణాది భాషలతో పాటూ మొత్తం ఐదుభాషల్లో 325 చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. 

ఎక్కడికి వెళ్లినా రాజసులోచన కూతురివా అంటూ ఆప్యాయంగా చూస్తుంటారు. అందుకే ఈ నాటికీ నలుగురులోకి వెళ్లినపుడల్లా అమ్మ గొప్పదనం ఆస్వాదిస్తుంటాను. అలాగే తండ్రి సీఎస్‌ రావు కూడా ప్రముఖ సినీ దర్శకులుగా పేరుగాంచారు. అమ్మానాన్నలు ఇద్దరూ సినీరంగంలో బీజీగా ఉండడాన్ని చూసినందునే నేను వారసురాలిగా రాలేదు. అయితే అమ్మ స్ఫూర్తితో నేను కూడా క్లాసికల్‌ కర్నాటక డ్యాన్స్‌ నేర్చుకున్నాను. అమ్మతో కలిసి అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. స్టేజిషోల్లో గాత్రదానం కూడా చేశాను. నాలుగేళ్ల క్రితమే ఆమె కన్నుమూశారు. 

ఈరోజు అమ్మ జ్ఞాపకాలతో తెలుగు మహిళలను కలుసుకోవడం ఆనందగా ఉందని అన్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్‌) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ, భిన్నకోణాల్లో తన నటనా పటిమను చాటుకుంటూ గత ఆరుదశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న నటి వై.విజయను, బహుముఖ ప్రజ్ఞాశాలి రాజసులోచన కుమార్తె దేవీ కృష్ణ హాజరుకావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రతినెల ఒక సెలబ్రెటీతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా నేడు ఈ ఇద్దరు కళాకారులు హాజరయ్యారని మహిళావిభాగ్‌ అధ్యక్షురాలు ఉప్పులూరి విజయలక్ష్మి అన్నారు. నటుడు రాజ్‌కుమార్, విభాగ్‌ కోశాధికారి భారతి, మెహతా హాస్పిటల్స్‌ జనరల్‌ మేనేజర్‌ యువరాజ్‌ గుప్త, చెన్నైపురి ట్రస్ట్‌ నగర అధ్యక్షులు బెల్లంకొండ సాంబశివరావు, వామ్‌ గ్లోబల్‌ కో–ఆర్డినేటర్‌ పొన్నూరు రంగనాయకులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement